
న్యూఢిల్లీ, వెలుగు: క్రిస్టియన్ మతం స్వీకరిస్తే ఎస్సీ హోదా వర్తించదనే ఏపీ హైకోర్టు తీర్పును సమీక్షించాలని ఆ రాష్ట్రానికి చెందిన పాస్టర్ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు క్రైస్తవ మతంలోకి చేరిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని, వారు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరన్న హైకోర్టు తీర్పును రద్దు చేయాలని పిటిషన్ వేశారు. కులం పేరుతో దూషించి, దాడి చేశారని ఏపీకి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో ఆరుగురిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో ఆరుగురిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆనంద్గత పదేండ్లుగా పాస్టర్‌గా ఉన్నారని, క్రైస్తవంలోకి వెళితే ఎస్సీ కులస్తులుగా పరిగణించకూడదని, దీంతో తమపై దాఖలైన కేసులు కొట్టివేయాలని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యంగం ప్రకారం హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించినవారు ఎస్సీ హోదాను కోల్పోతారన్న వాదనలతో హైకోర్టు బెంచ్ ఏకీభవిస్తూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలని గత మేలో ఉత్తర్వులిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ.. ఆనంద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. అనంతరం ఆగస్టు 12కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.